: కోల్కతాలో దారుణం.. రూ.1500 అప్పు చెల్లించలేదని నిప్పంటించిన వైనం
అప్పుగా తీసుకున్న రూ.1500 చెల్లించలేదని ఏకంగా రుణ గ్రహీతకు నిప్పుపెట్టాడో దుర్మార్గుడు. మంటల్లో కాలిపోతూ వీధుల్లో పరిగెడుతున్న బాధితుడిని చూసిన వారు దుప్పట్లు కప్పి మంటలు అదుపు చేసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. కోల్కతాకు చెందిన సుకుర్ సా(40).. సురీందర్ వద్ద కొన్ని రోజుల క్రితం రూ.1500 అప్పుగా తీసుకున్నాడు. బుధవారం రాత్రి సుకుర్ వద్దకు వెళ్లిన సురీందర్ తన డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన సురీందర్.. సుకుర్కు నిప్పంటించాడు. మంటలకు తాళలేని సుకుర్ వీధుల్లో పరుగులు పెట్టాడు. స్థానికులు వెంటనే స్పందించి దుప్పట్ల సాయంతో మంటలు అదుపు చేసి ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలపాలైన సుకుర్ పరిస్థితి విషమంగా ఉందని, మరికొన్ని గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు సురీందర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.