: సల్మాన్ కు మూడోసారి సమన్లు.. హాజరుకాకుంటే చర్యలు తప్పవన్న మహిళా కమిషన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మహారాష్ట్ర మహిళా కమిషన్ (ఎంఎస్డబ్ల్యూసీ) మూడోసారి సమన్లు జారీ చేసింది. వివాదాస్పద రేప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తప్పకుండా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని పేర్కొంది. జూలై 14న బాంద్రా(ఈస్ట్)లోని కమిషన్ కార్యాలయంలో తప్పకుండా హాజరుకావాల్సిందేనని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ‘‘ఆయన స్వయంగా కాకుంటే చివరికి అతని తరపున ప్రతినిధిని అయినా పంపించి వివరణ ఇవ్వాల్సిందే’’ అని ఎంఎస్డబ్ల్యూసీ చైర్ పర్సన్ విజయ రాహత్కర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఆయన కమిషన్ ఎదుట హాజరుకావాల్సి ఉండగా ఈద్ సందర్భంగా సల్మాన్ రాకపోవడంతో చివరిసారిగా సమన్లు జారీచేసింది. గత నెలలో సల్మాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'సుల్తాన్' సినిమా షూటింగు సందర్భంగా మల్లయుద్ధం దృశ్యాల చిత్రీకరణ తర్వాత తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితిలా ఉండేదని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. మహిళా కమిషన్ ఆయనకు రెండుసార్లు సమన్లు జారీ చేసినా ‘సుల్తాన్’ స్పందించలేదు. దీంతో చివరిసారిగా గురువారం సమన్లతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈసారి హాజరు కాకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.