: దలైలామా! సరైన దారిలో నడవండి: చైనా హితవు


టిబెట్ వివాదానికి స్వస్తి పలికి, స్వయంప్రతిపత్తి కల్పించాలంటూ బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హాంగ్ లీ స్పందించారు. చైనాలోని బీజింగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దలైలామా చైనాను విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆయనకు ఓ సూచన చేస్తున్నానని చెప్పిన ఆయన... ఇప్పటికైనా సమయం మించిపోలేదని, ఆయన ప్రత్యేక వాదాన్ని విడిచి సరైన మార్గంలో నడవాలని సూచించారు. స్వతంత్ర ప్రతిపత్తి కావాలన్న డిమాండ్ తో ఈ రెండు దేశాల మధ్య జరిగిన చర్చలు ఫలితమివ్వలేదు. దీంతో కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య చర్చలు జరగడం లేదు. టిబెట్ చైనాలో భాగం కాదని, స్వాతంత్ర్యం కావాలని దశాబ్దాలుగా పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. కనీసం మధ్యేమార్గంగా టిబెట్ కు స్వయం ప్రతిపత్తి కల్పించాలని దలైలామా డిమాండ్ చేస్తున్నారు. చైనా ప్రతీకార చర్యల కారణంగా ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆధ్యాత్మిక అతిథిగా ఆశ్రయం పొందుతున్నారు. బుద్ధుడు జన్మించి, నడయాడిన పవిత్ర నేలపై ఉన్నందుకు గర్వంగా ఉందని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే ఆయన ధర్మశాల నుంచి టిబెట్ కు తిరిగి రావాలని కోరుతూ ఇటీవల కాలంలో 120 మందిపైగా టిబెటన్లు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు.

  • Loading...

More Telugu News