: ఆట రూపంలో సోషల్ మీడియాకెక్కిన ఢాకా బేకరీ దాడులు!
గతంలో 'పిల్లలూ, ఆటలాడుకోండి' అంటే దొంగ-పోలీస్ ఆట ఆడుకునేవారు. మరి ఇప్పుడో టెర్రరిస్ట్-భద్రతా దళం ఆటలాడుతున్నారు. బంగ్లాదేశ్ లోని ఢాకాలో హోలీ అరిస్టాన్ బేకరీపై ఇటీవల దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల ఘటన చిన్నపిల్లలపై కూడా ప్రభావం చూపింది. దాంతో బంగ్లా బాలలు ఆయా పాత్రలు పోషిస్తూ ఆ ఘటనను కళ్లకు కట్టేలా వీడియో ఒకటి రూపొందించారు. ఈ వీడియోలో ఉగ్రవాదులు గబగబా వచ్చి హోటల్ లో దూరతారు. వారిని ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలను రంగంలోకి దించగా, వారిని ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు ఏమాత్రం ఆసక్తి చూపవు. ఈలోగా హోటల్ లోని బందీలందర్నీ ఉగ్రవాదులు చంపేసి, తమను తాము పేల్చుకుని మరణిస్తారు. అనంతరం అక్కడికి చేరుకున్న భద్రతా దళాలు తాము విజయం సాధించినట్టు సంబరాలు చేసుకుంటాయి. ఈ తతంగాన్ని వీడియోగా రూపొందించిన బాలలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అది విశేషమైన ఆదరణ పొందుతోంది. ఆ టెర్రర్ ఘటన బంగ్లా బాలలపై ఎంతగా ప్రభావం చూపిందీ, ప్రభుత్వం పట్ల, భద్రతా దళాల పట్ల తమకున్న నమ్మకం ఏపాటిదీ అన్న అంశాలను ఆ బాలలు ఈ వీడియోలో వ్యంగ్యంగా చెప్పిన తీరు పెద్దలను ఆలోచింపజేస్తోంది!