: జకీర్ నాయక్ శాంతి దూత అట!... కలకలం రేపుతున్న డిగ్గీరాజా వీడియో!
కాంగ్రెస్ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆ పార్టీ కీలక విభాగం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఎప్పుడో 2012లో చేసిన ఓ ప్రసంగానికి చెందిన వీడియో ఈ వివాదానికి తెర లేపింది. ఆ వీడియోలో డిగ్గీరాజా వివాదాస్పద ఇస్లామిక్ మత గురువు, ఇస్లామిక్ రీసెర్చీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ ను శాంతి దూతగా అభివర్ణించారు. 2012 జరిగిన ఓ కార్యక్రమంలో జకీర్ నాయక్ తో కలిసి వేదిక పంచుకున్న సందర్భంగా డిగ్గీరాజా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జకీర్ నాయక్ ప్రసంగాలు ప్రసారమవుతున్న ‘పీస్ టీవీ’లో ఈ వీడియో కూడా నాడు ప్రసారమైంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ బేకరిపై ముప్పేట దాడికి పాల్పడి 20 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదుల్లో ఇద్దరిని ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్ ను డిగ్గీరాజా శాంతి దూతగా అభివర్ణించిన వైనంపై బీజేపీ భగ్గుమంది. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల పట్ల మెతక వైఖరి అవలంబిస్తుందనడానికి డిగ్గీరాజా వ్యాఖ్యలే నిదర్శనమని బీజేపీ విరుచుకుపడింది. నాడు ప్రసారమైన డిగ్గీరాజా వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.