: బంగ్లాకు ఎన్ఐఏ బృందం!... ఉగ్ర దాడుల విచారణలో సహాయానికేనట!
ఉగ్రవాద దాడులతో అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్ కు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు చెందిన ఓ బృందాన్ని పంపేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ముంబై దాడుల తర్వాత ఉగ్రవాద దాడులను తిప్పికొట్టడంతో పాటు సదరు కేసుల దర్యాప్తు నిమిత్తం భారత్ ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా... ఎన్ఐఏ అధికారులు వాలిపోతున్నారు. అంతేకాకుండా నిఘా వర్గాల సూచనలతో దాడులకు ముందే రంగంలోకి దిగుతూ ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే బంగ్లా రాజధాని ఢాకాలో భీకర ఉగ్రదాడి చోటుచేసుకుంది. వారం తిరక్కముందే నేటి ఉదయం మరో దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఈ దాడులకు సంబంధించిన దర్యాప్తులో బంగ్లా అధికారులకు తోడ్పాటునందించేందుకు ఎన్ఐఏ బృందాన్ని బంగ్లాకు పంపేందుకు భారత్ నిర్ణయించింది. త్వరలోనే ఈ బృందం అక్కడకు బయలుదేరనున్నట్లు సమాచారం.