: చూపు వచ్చేవరకు ఆసుపత్రి నుంచి కదిలేదిలేదు: సరోజని దేవి ఆసుపత్రి బాధితులు
హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు కంటి చూపుని కోల్పోయే ప్రమాదంలో పడ్డ విషయం తెలిసిందే. రోగుల కంటి చూపు మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తామని వైద్యులు చెప్పారు. అయితే రోగులకు కంటిచూపు మెరుగయ్యే క్రమంలో ఎటువంటి మార్పు కనపడడం లేదని సమాచారం. అంతేగాక, ఆపరేషన్ చేసిన కంటికి మాత్రమే కాకుండా మరో కంటి చూపు కూడా మందగిస్తోందని బాధితులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వైద్యులు రెండు రోజుల్లో చూపు తిరిగి వస్తుందని అంటున్నారు. ఈ అంశంపై తాజాగా సరోజని దేవి కంటి ఆసుపత్రి సుపరింటెండెంట్ మాట్లాడుతూ.. నిన్న డిశ్ఛార్జి చేసిన ఏడుగురిలో ఒకరికి చూపు వచ్చిందని చెప్పారు. మరో 2 రోజుల్లో మిగతా ఆరుగురికి చూపువస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఐదుగురు పేషెంట్లు ఆసుపత్రిలో ఉన్నారని, వాళ్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని ఆయన చెప్పారు. వారి కంటి చూపు పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు. వీరికి చూపు కచ్చితంగా వస్తుందని చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, తమకు చూపు వచ్చేవరకు ఆసుపత్రి నుంచి కదిలేది లేదని రోగులు కరాఖండీగా చెబుతున్నారు.