: ఉగ్రవాదులతో భీకరయుద్ధం చేస్తున్న బంగ్లాదేశ్ భద్రతాదళాలు; పెరిగిన మృతుల సంఖ్య
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని కిషోర్ గంజ్ లోని షోలాకియా ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలకు ముస్లింలు సిద్ధమవుతున్న వేళ, పోలీసుల కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతుల సంఖ్య 4కు పెరిగింది. ఈ ఘటనలో ఒక పోలీసుతో పాటు మరో ముగ్గురు పౌరులు కూడా మరణించారు. గాయపడిన పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ బాంబులు పేల్చిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతాదళాలు రంగంలోకి దిగగా, వారికీ, ఉగ్రవాదులకు మధ్య తీవ్ర పోరు జరుగుతోంది. ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని, పోలీసులు, సైనికులు భీకరయుద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇరువైపుల నుంచి ఎదురుకాల్పులు వినిపిస్తున్నట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.