: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం... ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అమరవెల్లి ఉప్పాడ ప్రాంత శివారులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు ఉదయం అక్కడి ఉప్పుటేరులో దూకి వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఉప్పుటేరులో నలుగురి మృతదేహాలు ఉండడాన్ని గమనించి స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకి అందించారు. దానిలోనుంచి మృత దేహాలను బయటకు తీశారు. మృతి చెందిన వారు రాజాల భూలక్ష్మి(48), ఆమె కుమారులు ప్రేమ్‌కుమార్(22), అనిల్‌కుమార్(21), ప్రభుదాస్(20)గా గుర్తించారు. రాజాల భూలక్ష్మి, ఆమె ముగ్గురు కుమారులు మొదట పురుగుల మందుతాగి, ఆ తరువాత కాళ్లకు తాడుకట్టుకొని ఉప్పుటేరులో దూకినట్లు తెలుస్తోంది. భూలక్ష్మి ముగ్గురు కుమారులు అనారోగ్యంతో బాధపడుతుండడంతో వీరందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఉప్పుటేరు వద్దకు చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.