: ఉగ్రవాదానికి ఎన్నడూ మద్దతివ్వలేదు!... ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న జకీర్ నాయక్!
ఇస్లామిక్ వివాదాస్పద మత గురువు, ఇస్లామిక్ రీసెర్చి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. తానెన్నడూ ఉగ్రవాదానికి మద్దతివ్వలేదని ప్రకటించిన ఆయన హోం శాఖ చేపట్టే ఎలాంటి దర్యాప్తునకైనా తాను సిద్ధమేనని ఆయన ప్రకటించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరిపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్లోని ఇద్దరు ముష్కరులు జకీర్ నాయక్ ప్రసంగాలకు ఆకర్షితులయ్యారని వచ్చిన వదంతుల నేపథ్యంలో జకీర్ పేరు వెలుగులోకి వచ్చింది. నేటి ఉదయం ముంబైలోని ఆయన కార్యాలయం ఎదుట నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. ‘‘నేను ఉగ్రవాదానికి మద్దతిస్తున్నానన్న ప్రచారం అవాస్తవం. ఇప్పటిదాకా ఏ ఒక్క దర్యాప్తు సంస్థ కూడా జకీర్ నాయక్ ఉగ్రవాదానికి మద్దతిస్తున్నాడని చెప్పలేదు. నేను చేసిన ప్రసంగాలన్నింటినీ పరిశీలించేందుకు హోం శాఖను ఆహ్వానిస్తున్నాను. నేను చాలా మందినే ప్రభావితం చేశాను. నా ప్రసంగాలు విన్నవారంతా నాకు తెలియదు. మీడియా, రాజకీయాలు నన్ను అప్రతిష్ఠ పాలు చేస్తాయని భయమేస్తోంది. నా ఫొటోను వాడుకుని నన్ను ఇబ్బంది పెట్టేందుకు కొంత మంంది యత్నించారు. నాపై ఎలాంటి దర్యాప్తునకైనా నేను సిద్ధం. ఉగ్రవాదులుగా మారమని నేను ఏ ఒక్క ముస్లింకు బోధించలేదు’’ అని సుదీర్ఘ వివరణ ఇచ్చారు.