: తాత్కాలిక సచివాలయాన్ని సంభ్రమాశ్చర్యాలతో చూసిన నరసింహన్
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం భవనాలను పరిశీలించేందుకు వచ్చిన గవర్నర్ నరసింహన్ భవనాలను సంభ్రమాశ్చర్యాలతో పరిశీలించారు. ఇంత త్వరగా ఇంత భారీ భవనాల నిర్మాణం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. పనులు శరవేగంగా జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు ప్రారంభమైన తరువాత గవర్నర్ వెలగపూడికి రావడం ఇదే తొలిసారి. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులు ఐదవ భవంతి ముందు గవర్నర్ కు స్వాగతం పలికారు. ఐదో భవంతిలో ఇప్పటికే కొన్ని కార్యాలయాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఇదే భవంతిలోని ప్రత్యేక చాంబర్ లో నరసింహన్, చంద్రబాబులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్యా చర్చలు జరుగుతున్నాయి. హైకోర్టు విభజన అంశంపై వీరు మాట్లాడుకుంటున్నట్టు సమాచారం.