: నారసింహుడికి నరసింహన్ సేవ... నాలుగు బిందెల పానకం నైవేద్యం!
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఈ ఉదయం మంగళగిరి పానకాల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనార్థం వచ్చిన నరసింహన్ కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆపై నరసింహ స్వామిని దర్శించుకున్న నరసింహన్, 4 బిందెల పానకాన్ని నైవేద్యంగా సమర్పించుకున్నారు. ఆపై ఆనవాయతీ ప్రకారం స్వామి రెండు బిందెల పానకాన్ని వెనక్కు తిరిగి ఇచ్చేయగా, గవర్నర్ దాన్ని భక్తితో స్వీకరించి, భక్తులకు పంచారు. మంగళగిరి పానకాల నరసింహస్వామి ఆలయంలో స్వామికి ఎంత పానకం పోస్తే, అందులో సగం బయటకు వచ్చి, మిగతాది అదృశ్యమవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ ఆలయంలోని అంతు పట్టని మిస్టరీయే ఇది. తనకు భక్తులు సమర్పించే పానకంలో సగం తాగేయడం ఇక్కడి నారసింహుని శక్తికి నిదర్శనంగా చెబుతారు. గవర్నర్ వెంట మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ ఉన్నారు. ఇక్కడి నుంచి గవర్నర్ వెలగపూడికి వెళ్లి, అక్కడ జరుగుతున్న తాత్కాలిక సచివాలయ పనులను పరిశీలించనున్నారు.