: వైసీపీ వాళ్లొస్తున్నారు... ఇళ్లు జాగ్రత్త అంటున్న వర్ల!
ఏపీలో విపక్షం వైసీపీ రేపటి నుంచి ‘గడపగడపకూ వైసీపీ’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి తెర తీస్తోంది. దాదాపు ఆరు నెలల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నేతలు ఇంటింటి తలుపు తట్టనున్నారు. అధికార పార్టీ టీడీపీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్న వైసీపీ... వాటిని జనానికి వారి ఇళ్ల ముందే వివరించేందుకు ప్రత్యేకంగా కర పత్రాలు కూడా సిద్ధం చేసుకుందట. ఈ కార్యక్రమంపై నిన్న టీడీపీ సీనియర్ నేత, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. ‘‘వైసీపీ వాళ్లొస్తున్నారు. ఇళ్లు జాగ్రత్త’’ అంటూ ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘11 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారంతా రోడ్ల మీదకు వస్తున్నారు. ప్రజలంతా తమ ఇళ్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలో నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన వైసీపీ కార్యక్రమంపై నిప్పులు చెరిగారు. వైసీపీని చచ్చిపోయిన పార్టీగా అభివర్ణించిన వర్ల... ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దింపుడు కళ్లం ఆశలతో ఉన్నారని ధ్వజమెత్తారు. సీఎంగా నారా చంద్రబాబునాయుడికి ప్రజలెప్పుడో వంద మార్కులేశారని, విపక్ష నేతగా జగన్ కు ప్రజలెన్ని మార్కులేస్తారో ఆ కరపత్రంలో ఆప్షన్ గా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తాను డిమాండ్ చేసినట్లు కరపత్రంలో మార్కుల విషయాన్ని చేర్చితే... జగన్ కు ప్రజలు సున్నా మార్కులే వేస్తారన్నారు. లేని పక్షంలో తాను చెవి కోసుకుంటానని వర్ల వ్యాఖ్యానించారు.