: మోదీ రూ. 50 వేల కోట్లిస్తే... 75 కోట్ల మందికి రూ. 251కి ఫోన్ ఇస్తాం!: రింగింగ్ బెల్స్ కొత్త మెలిక!


నరేంద్ర మోదీ సర్కారు డిజిటల్ ఇండియా ఫండ్స్ కు కేటాయించిన నిధుల నుంచి రూ. 50 వేల కోట్లను తమ సంస్థకు ఇస్తే, దేశంలోని 75 కోట్ల మందికి రూ. 251కే స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని రింగింగ్ బెల్స్ సీఈఓ మోహిత్ గోయల్ వ్యాఖ్యానించారు. ఫ్రీడమ్ 251 పేరిట సంచలనాత్మక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసి, ఆపై విమర్శల పాలైన రింగింగ్ బెల్స్ సంస్థ ఇప్పటికే స్మార్ట్ ఫోన్ డెలివరీలను మూడు సార్లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక తాజా డెలివరీ తేదీ జులై 8. ఈ నేపథ్యంలో మోహిత్ మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్ల డెలివరీని రేపు ప్రారంభించనున్నామని, డెలివరీ చార్జీలుగా రూ. 40 చెల్లించాల్సి వుంటుందని తెలిపారు. తొలి విడతలో 5 వేల యూనిట్లను మాత్రమే డెలివరీ చేయనున్నామని, ఆపై వారి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను పరిశీలించి ముందడుగు వేస్తామని తెలిపారు. కస్టమర్ల సౌకర్యార్థం దేశవ్యాప్తంగా 500 కస్టమర్ కేర్ సెంటర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఒక్కో ఫోన్ పై రూ. 180 నుంచి రూ. 270 వరకూ నష్టాన్ని భరిస్తున్నామని మోహిత్ తెలిపారు. కేవలం ఫ్రీడమ్ 251 యూజర్ల కోసం రూ. 1 నుంచి రూ. 3 మధ్య 100కు పైగా కొత్త యాప్స్ సిద్ధం చేశామని, వాటి ద్వారా తమకు నష్టపోయే ఆదాయం వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. కాగా, ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్, 4 అంగుళాల డిస్ ప్లే, 1.3 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ అంతర్గత మెమోరీ, 8/3.2 ఎంపీ కెమెరాలు, 1,800 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News