: గవర్నర్ విందు స్పెషల్!... డైనింగ్ టేబుల్ పై 15 రకాల ఐటమ్స్, స్వీటు బాక్సుతో పాటు వెంకన్న ప్రసాదం!
తనతో భేటీ కోసం విజయవాడకు వచ్చిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మరుపురాని విందు ఇచ్చారు. గవర్నర్ కోసమే ప్రత్యేకంగా తయారు చేయించిన మెనూకు సంబంధించి చంద్రబాబు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తిగా శాకాహారి అయిన నరసింహన్ కు పంచభక్ష్య పరమాన్నాలతో చంద్రబాబు విందిచ్చారు. నిన్న రాత్రి జరిగిన విందులో నరసింహన్ ముందు టేబుల్ పై 15 రకాలు ఐటమ్స్ వచ్చి చేరాయట. వాటిలో క్యారెట్ బొబ్బట్లు, గారెలు, పూర్ణం బూరెలు, పచ్చి శనగపప్పు గోంగూర కూర, టమోటా కొత్తిమీర చట్నీ, ఆంధ్రా గోంగూర చట్నీ, దొండకాయ, బీరకాయ చట్నీ, మిక్స్ డ్ వెజిటబుల్ కూర, ఉలవచారు, ముద్దపప్పు, మునక్కాయ, బెండకాయ కూరలు, గుమ్మడి వడియాలు, ఊర మిరపకాయలు, సాంబారు, రసం ఉన్నాయి. ఇక విందు తర్వాత అక్కడి నుంచి హోటల్ కు బయలుదేరిన నరసింహన్ చేతిలో చంద్రబాబు ఓ గిఫ్ట్ ప్యాక్ పెట్టారు. అందులో ఆంధ్రా మిఠాయిలు... కాకినాడ కాజాలు, అరిసెలు, బందరు లడ్డూలు, బెల్లం, పంచదార పూతరేకులు, కజ్జికాయలు, సున్నుండలతో పాటు బెంగాలి మిఠాయి రసగుల్లాలు ఉన్నాయట. ఇక ఈ గిఫ్ట్ ప్యాక్ తో పాటు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన శ్రీవారి ప్రసాదాన్ని కూడా గవర్నర్ కు చంద్రబాబు అందజేశారు.