: ఇదేం ‘ఆర్థిక సంవత్సరం’!... ‘ఏప్రిల్ 1- మార్చి 31’ మార్పునకు కమిటీ!
ఆర్థిక సంవత్సరమంటే... ఏప్రిల్ 1తో ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31తో ముగుస్తుంది. ఇది దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరం. ఇప్పటిదాకా మనమంతా దీనినే పాటిస్తున్నాం. ఆదాయపన్ను చెల్లింపులు, లాభ నష్టాల బేరీజు కూడా దీని ఆధారంగానే జరుగుతున్నాయి. ఇక కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు కూడా దీని ప్రాతిపదికగానే రూపొందుతున్నాయి. ఇంతటి కీలక ప్రాధాన్యమున్న ఆర్ధిక సంవత్సరం ‘ఏప్రిల్ 1’ నుంచే ఎందుకు ప్రారంభం కావాలని కేంద్ర ప్రభుత్వానికి ఓ డౌటు వచ్చింది. వెనువెంటనే కార్యరంగంలోకి దిగింది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై, మార్చి 31తో ముగిసే విధానానికి స్వస్తి చెప్పేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర అధ్యయనం చేసి ఓ నివేదిక ఇవ్వాలంటూ కేంద్రం... ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా పనిచేసిన శంకర్ ఆచార్య అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన కేఎం చంద్రశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శిగానే కాకుండా తమిళనాడు గవర్నర్ గా పనిచేసిన పీవీ రాజారామన్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చికి చెందిన రాజీవ్ కుమార్ లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది.