: ఏపీ సైట్ లోకి టీఎస్ సీఎంఓ అధికారి లాగిన్!... విచారణకు చంద్రబాబు సర్కారు నిర్ణయం!


తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం ముదిరింది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’కు సంబంధించి ఏపీ సర్కారు అప్ లోడ్ చేసిన సమాచారం మొత్తం తాము రూపొందించిందే అని ఆరోపిస్తున్న తెలంగాణ సర్కారు... చంద్రబాబు సర్కారు తమను కాపీ కొట్టిందని ఆరోపించింది. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందున్న తాము గతేడాదే రెండో స్థానంలో ఉన్నామని చెబుతున్న ఏపీ సర్కారు... ఇతరులను కాపీ కొట్టాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు తాము అప్ లోడ్ చేసిన సమాచారం తమకు కాకుండా ఇతర రాష్ట్రాలకు తెలిసే అవకాశం లేదన్న కొత్త వాదనను ఏపీ ప్రస్తావించింది. తమ వెబ్ సైట్ లోకి అనధికారికంగా చొరబడిన వ్యక్తులకే ఈ సమాచారం తెలుస్తుందని కూడా వాదిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన అధికారులు తమ వెబ్ సైట్ లోకి చొరబడ్డారని, ఇది ముమ్మాటికీ హ్యాకింగేనని ఏపీ సర్కారు భావిస్తోంది. ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణకు దాదాపుగా నిర్ణయం తీసుకున్న ఏపీ... నేడు సదరు విచారణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఏపీ నిగ్గు తేల్చిన వివరాల మేరకు... ఈ నెల 2న తెలంగాణ సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి తమ వెబ్ సైట్ లోకి చొరబడ్డారట. సదరు అధికారి ద్వారానే తాము అప్ లోడ్ చేసిన సమాచారం తెలంగాణకు చేరిపోయిందట. తాము సమాచారాన్ని అప్ లోడ్ చేసిన తర్వాత ఎవరెవరు సైట్ లోకి ప్రవేశించారన్న సమాచారాన్ని పరిశీలించిన మీదటే ఏపీ ఈ విషయాన్ని నిగ్గు తేల్చింది.

  • Loading...

More Telugu News