: నివాసయోగ్యమైన భారతీయ నగరాల్లో హైదరాబాదుదే అగ్రస్థానం!
దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం ఏదీ? ముంబై, ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు... ఇలా అన్ని నగరాలను ఓ సారి లెక్కపెట్టుకుంటాం. కానీ ఇవేవీ కాదట. భాగ్యనగరి హైదరాబాదుదే ఈ విషయంలో అగ్రస్థానమట. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాదు తాజాగా ఖ్యాతిగాంచింది. ఈ మేరకు గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ కన్ సల్టింగ్ సంస్థ ‘మెర్సర్’ విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలో హైదరాబాదు అన్ని భారతీయ నగరాల కంటే కూడా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 230 నగరాలతో కూడిన ఈ జాబితాలో హైదరాబాదు 139వ స్థానంలో నిలిచింది. ఆయా నగరాల్లో నివాసయోగ్యతకు సంబంధించిన 39 అంశాలను పరిగణనలోకి తీసుకున్న ‘మెర్సర్’ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 139 వ స్థానంలో నిలిచిన హైదరాబాదు దేశంలోనే ఉత్తమ నగరంగా ఎన్నికైంది. ఇక హైదరాబాదు తర్వాతి స్థానాల్లో నిలిచిన భారతీయ నగరాల విషయానికొస్తే...144వ స్థానంలో పుణే నిలిచింది. ఆ తర్వాత బెంగళూరు (145), చెన్నై (150), ముంబై (152), కోల్ కతా (160), ఢిల్లీ (161) స్థానాల్లో ఉన్నాయి. తాను పరిగణనలోకి తీసుకున్న 39 అంశాలను మెర్సర్... ఓ పది విభాగాలుగా కూర్చి సర్వే చేసిందట. వీటిలో రాజకీయ- సామాజిక వాతావరణం, రాజకీయ- సాంస్కృతిక, వైద్య, ఆరోగ్య సేవల లభ్యత, విద్యావకాశాలు, పౌర సేవలు, రవాణా, వినోదం, వినియోగ వస్తువులు, గృహ నిర్మాణం, సహజ వాతావరణం తదితరాలు ఉన్నాయి.