: ఏపీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఆర్ యూనివర్సిటీ
ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఇప్పటివరకూ నిర్వహించిన కౌన్సిలింగ్ కు భిన్నంగా వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ నిర్వహించాలని ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్ణయించింది. దీంతో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తరహాలో ఈ నెల 12 నుంచి 17 వరకు ఆరు రోజుల పాటు ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. ఈ కౌన్సిలింగ్ ను విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ లలోని నిర్ణయించిన కేంద్రాల్లో నిర్వహిస్తారు. కౌన్సిలింగ్ లో తొలి రెండు రోజులు 6 వేల ర్యాంకు వరకు ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. ఈ రెండు రోజులు రోజుకి 3 వేల ర్యాంకుల చొప్పున ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. తరువాతి నాలుగు రోజుల్లో 60,000వ ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని అనుసరించి ర్యాంకర్లు అన్ని ధ్రువపత్రాలు, ఫీజులతో కౌన్సిలింగ్ కు హాజరు కావాలని వారు సూచించారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని అధికారులు సూచించారు.