: ఇండియా, అమెరికాలు సంయుక్తంగా పాక్ పై యుద్ధానికి కుట్రపన్నాయి: హఫీజ్ సయీద్ ఆరోపణ
భారతదేశాన్ని చూస్తే చాలు కడుపుమండిపోయే పాకిస్థాన్ ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్ మరోసారి మనదేశంపై అక్కసు వెళ్లగక్కాడు. 'భారతదేశాన్ని అది చేస్తాం, ఇది చేస్తాం' అని బెదిరించే హఫీజ్ ఈ సారి అమెరికాను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. అమెరికా, భారత్ లు పాకిస్థాన్ పై యుద్ధానికి కుట్రలు పన్నాయని ఆరోపించాడు. ఈద్ ఉల్ ఫితుర్ ను పురస్కరించుకుని లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో మాట్లాడుతూ, పాక్ పై యుద్ధానికి భారత్, అమెరికాలు ఒప్పందం చేసుకున్నాయని అన్నాడు. సౌదీ అరేబియా, పాకిస్థాన్ దేశాలు అమెరికాకు దూరం కావడం శుభపరిణామమని తెలిపాడు. ఇస్లామిక్ యూనియన్ కు ఇది ఉపయోగపడుతుందని అన్నాడు. సౌదీ అరేబియాలో జరిగిన బాంబు దాడులను ఖండించిన హఫీజ్ సయీద్, ఇది విదేశాల కుట్ర అని పేర్కొన్నాడు. భారత్ ఎయిర్ పోర్టుల్లో అమెరికన్ డ్రోన్లను మోహరిస్తుంటే, పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం అదేమీ పట్టించుకోకుండా ప్రతిపక్షంతో లడాయి వేసుకుంటోందని మండిపడ్డాడు. కాగా, ఈ ఉగ్రవాది తలకు అమెరికా ఇప్పటికే పది మిలియన్ డాలర్ల ఖరీదు కట్టింది.