: రెండోసారి... వేలానికి విజయ్ మాల్యా ప్రైవేట్ జెట్
బ్యాంకులకు ఝలక్కిచ్చి లండన్ చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన వ్యక్తిగత విమానాన్ని మరోసారి వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ విమానాన్ని జూన్ 30న 152 కోట్ల రిజర్వ్ ధరతో సేవల పన్ను శాఖ వేలానికి పెట్టగా దీనిని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు పెద్దగా ఆసక్తి చూపలేదు. యూఏఈకి చెందిన అల్నా ఏరో డిస్ట్రిబ్యూషనల్ ఫైనాన్స్ హోల్డింగ్స్ సంస్థ అధికారులు కోట్ చేసిన రిజర్వ్ ధర కంటే చాలా తక్కువగా కేవలం 1.09 కోట్ల రూపాయలకు బిడ్ వేసింది. దీంతో అధికారులు ఈ బిడ్ ను తిరస్కరించారు. అనంతరం అధికారులు మరోసారి బాంబే కోర్టును ఆశ్రయించడంతో మరోసారి దీనిని వేలం వేసేందుకు అనుమతిచ్చింది. దీంతో ఆగస్టు 21న ఈ విమానాన్ని మరోసారి వేలం వేయనున్నారు. ఈసారి బిడ్డర్లను ఆకర్షించేందుకు గతంలో కంటే తక్కువ రిజర్వ్ ధరను నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది.