: విజయవాడలో మరి కాసేపట్లో చంద్రబాబుతో భేటీ కానున్న గవర్నర్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో విజయవాడలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సమస్యలపై ఆయన చర్చిస్తారు. రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివిధ అంశాలపై విభేదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఉద్యోగుల కేటాయింపులు, హైకోర్టు విభజన కృష్ణా జలాల పంపకాలు, తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం, ఏపీకి రావాల్సిన బకాయిల చెల్లింపులు... ఇలా ఎన్నో అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. వీటిల్లో ఏకాభిప్రాయ సాధనకోసం ఆయన ఈ సమావేశంలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. కాగా, సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన విందుకు హాజరవుతున్నట్టు అధికారిక సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.