: మీ బెదిరింపులు, ధమ్కీలు నన్నేమీ చేయలేవు!: అసదుద్దీన్ ఒవైసీ
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు, భజరంగ్ దళ్ రెండూ తనను బెదిరిస్తున్నాయని ఎంఐఎం అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ రెండు సంస్థలకు తనతో ప్రమాదం ఉందని, అందుకే తనను లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. నెల రోజుల క్రితం ఐఎస్ఐఎస్ తాను హిందూ ఏజెంట్ నని ఆరోపిస్తూ...తనను అంతమొందిస్తామని ప్రకటించిందని, ఇప్పుడు బీజేపీ కూడా తనతో ఇబ్బంది అని భావించి, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఆయన చెప్పారు. అయినా, ఈ రెండు సంస్థలు చేసే బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని ఆయన తెలిపారు. ధమ్కీ ఇస్తే వెనక్కి తగ్గుతాననే భావనలో ఉన్నారని, దానికి ఇంకెవరినో చూసుకోవాలని ఆయన సూచించారు. మనదేశంలో నరమేధం సాగించిన పాకిస్థాన్ తీవ్రవాది అజ్మల్ కసబ్ కు న్యాయ సహాయం అందించేందుకు కోర్టులే ముందుకు వచ్చాయని, అలాంటప్పుడు నిందితులకు న్యాయసహాయం చేయడంలో వచ్చిన ఇబ్బందేమిటని ఆయన ప్రశ్నించారు. తాను తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కితగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు.