: మేము అనుసరిస్తోన్న విధానాలను ఆదర్శంగా తీసుకోండి.. కానీ కాపీ కొట్టకండి!: ఏపీ సర్కారుకు ఎంపీ బాల్క సుమన్ సూచన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్‌లైన్ అప్లికేషన్లను కాపీ కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ చర్య దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. తమ ఆన్‌లైన్ అప్లికేషన్లను కాపీ కొట్టకపోతే దానికి సంబంధించిన విచారణకు సహకరించొద్దని ప్రభుత్వ నేతలు అధికారులను ఎందుకు ఆదేశించారని ఆయన దుయ్యబట్టారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సమాచారాన్ని కేంద్రం పరిశీలించాలని బాల్క సుమన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేతలు ఈ అంశంపై విచారణకు సహకరిస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవచ్చు కానీ, కాపీ కొట్టే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును కొందరు నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, అటువంటి చర్యలను ఆపేయాలని ఆయన అన్నారు.