: కొడుకు తలకొరివి పెట్టనన్నాడు.. ముస్లిం మహిళ ఆ బాధ్యతలు నిర్వహించి మానవత్వం చాటుకుంది!


జీవిత చరమాంకంలో ఆయన వృద్ధాశ్ర‌మంలో గ‌డిపాడు. చివ‌రికి అక్క‌డే త‌నువు చాలించాడు. క‌న్న‌కొడుకే ఆ వృద్ధుడికి త‌ల‌కొరివి పెట్ట‌న‌న్నాడు. కానీ ఓ ముస్లిం మ‌హిళ ఆ హిందూ వృద్ధుడి భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించి మాన‌వ‌త్వం చాటుకుంది. ఈ సంఘ‌ట‌న‌ వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌లో చోటుచేసుకుంది. అక్క‌డి వృద్ధాశ్ర‌మంలో కొంత కాలంగా త‌న జీవితాన్ని గ‌డుపుతోన్న ఓ వృద్ధుడు ఈరోజు మ‌ర‌ణించాడు. త‌న తండ్రి చ‌నిపోయాడ‌ని, అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌వ‌ల‌సిందిగా ఆ వృద్ధుడి కుమారుడికి ఆశ్ర‌మంలోని వారు తెలిపారు. అయితే, ఆశ్రమం వద్దకు చేరుకున్న స‌దరు పుత్ర‌ర‌త్నం తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించడానికి నిరాక‌రించాడు. త‌న తండ్రికి త‌ల‌కొరివి పెట్ట‌నని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పాడు. దీంతో అత‌డు చేయాల్సిన బాధ్య‌త‌ల‌ను యాకూబీ అనే ముస్లిం మ‌హిళ త‌న భుజంపై వేసుకొని అంత్య‌క్రియ‌ల్ని నిర్వ‌హించింది. ఆశ్ర‌మ నిర్వాహ‌కురాలైన ఆమె హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఆ వృద్ధుడి భౌతిక కాయానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన కారణంగా తాను తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించలేనని మరణించిన ఆ వృద్ధుడి కొడుకు పేర్కొన్నాడని యాకూబీ చెప్పింది. తమ వృద్ధాశ్రమంలో ఎవరైనా చనిపోతే మొదట చనిపోయిన వ్యక్తుల బంధువులకు ఆ సమాచారాన్ని అందిస్తానని, ఒకవేళ వారు రాకపోతే తానే అంత్యక్రియలు నిర్వహిస్తానని ఆమె చెప్పింది. వృద్ధాశ్రమంలో గడుపుతోన్న వారు బాధపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తాము ఇలా చేస్తున్నట్లు ఆమె చెప్పింది.

  • Loading...

More Telugu News