: కామాంధుడికి ధీర వనిత గుణపాఠం!... కళ్లల్లో కారం చల్లి చితకబాదిన వైనం!
దేశంలో మహిళలపై నానాటికీ ఘోరాలు పెరిగిపోతున్నాయి. అబలలను అమాంతం కబళిస్తున్న ఘటనలు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ధైర్యం చూపుతున్న మహిళలు తమపై విరుచుకుపడుతున్న మృగాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. ఈ తరహా ఘటనే నేటి ఉదయం ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. తనను కబళించేందుకు యత్నించిన ఓ మృగాడికి ఓ అబల తనదైన రీతిలో బుద్ధి చెప్పింది. కళ్లల్లో కారం చల్లి చితకబాదింది. సదరు ధీర వనిత దాడితో బెంబేలెత్తిన ఆ మృగాడు కాళ్లకు బుద్ధి చెప్పక తప్పలేదు. వివరాల్లోకెళితే... కృష్ణా జిల్లాలోని నూజివీడుకు చెందిన ఓ మహిళ వేరే ఊరికి వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చి బస్సు కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో అటుగా ఓ టవేరా వాహనంలో వచ్చిన ఓ వ్యక్తి తాను కూడా అటుగానే వెళుతున్నానని నమ్మించి ఆమెను వాహనం ఎక్కించుకున్నాడు. దారి మధ్యలో నిర్మానుష్య ప్రదేశానికి రాగానే అతడిలోని మృగాడు మేల్కొన్నాడు. కారు ఆపి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. దీంతో షాక్ తిన్న ఆ మహిళలోని ధీర వనిత కూడా ఒక్కసారిగా కళ్లు తెరిచింది. అంతే... వెంట తీసుకెళుతున్న సంచిలోని కారాన్ని చేతిలోకి తీసుకుని అతడి ముఖంపై చల్లింది. మృగాడి ముఖంపై పడ్డ కారం అతడి కళ్లను మండించింది. ఊహించని ఈ పరిణామంతో పాటు కళ్లల్లో కారం పెట్టిన ఇబ్బంది నుంచి అతడు తేరుకునేలోగానే బాధితురాలు అతడిపైకి లంఘించింది. ఇష్టం వచ్చినట్లు చితకబాదింది. బాధితురాలి దెబ్బలకు తాళలేని ఆ మృగాడు కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఆ తర్వాత బాధితురాలు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఆ మృగాడి కోసం గాలింపు చేపట్టారు.