: ఇప్పటివరకు ఏ రాష్ట్రం మరో రాష్ట్రంపై ఫిర్యాదు చేయలేదు: అప్లికేషన్లు కాపీ కొట్టారన్న ఆరోపణలపై పరకాల
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్లైన్ అప్లికేషన్లు కాపీ కొట్టారంటూ తమపై తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఈరోజు స్పందించారు. చవకబారు ఆరోపణలపై తాము దృష్టి సారించబోమని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తెలంగాణ మంత్రి ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. కావాలనే తమపై బురద చల్లుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం పోర్టల్ ద్వారా ఇప్పటికే 9 వేల లావాదేవీలు జరిగాయని పరకాల పేర్కొన్నారు. తెలంగాణ చేస్తోన్న ఆరోపణల్లో నిజంలేదన్న విషయాన్ని తాము నిరూపించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం మరో రాష్ట్రంపై ఇలాంటి ఫిర్యాదు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. కనీస సమాచారం లేకుండా మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు.