: ఈడీ దెబ్బతో వైసీపీ కుదేలు!... ‘గడపగడపకు...’ ఖర్చు నేతలదేనట!
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొట్టిన దెబ్బకు ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ దాదాపుగా కుదేలైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తొలుత సీబీఐ కేసు నమోదు చేయగా, ఆ తర్వాత రంగంలోకి దిగిన ఈడీ దర్యాప్తులో వేగం పెంచింది. ఇప్పటికే మూడు దఫాలుగా జగన్ సంస్థలకు చెందిన పలు ఆస్తులను ఆటాచ్ చేసిన ఈడీ...ఇటీవల నాలుగో దఫాలో ఏకంగా రూ.750 కోట్ల మేర ఆస్తులను జప్తు చేసింది. ఈ దెబ్బతో పార్టీకి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయన్న వాదన వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం హైదరాబాదులోని లోటస్ పాండ్ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నెల 8 నుంచి పార్టీ తరఫున ‘గడపగడపకూ వైసీపీ’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్ణయించారు. దాదాపు ఆరు నెలల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ నుంచి నిధులేమీ అందవని మొన్నటి సమావేశంలో ఆయన తేల్చి చెప్పారట. కేవలం స్టేషనరీ మాత్రమే పార్టీ కార్యాలయం నుంచి అందుతుందని, మిగిలిన ఖర్చులన్నీ స్థానిక నేతలే భరించాలని ఆయన చెప్పారట. తన ఆస్తులు ఈడీ అటాచ్ లోకి వెళ్లిపోవడంతో పార్టీ ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుందని చెప్పిన జగన్... 'గడప గడపకు వైసీపీ' కార్యక్రమానికి సింగిల్ పైసా ఇచ్చేది లేదని చెప్పేశారట. ఈ క్రమంలో ఆరు నెలల పాటు పార్టీ కార్యక్రమాన్ని కొనసాగించేలా కాస్తంత స్థితిమంతులైన నేతలను పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జీలుగా నియమించాలని కూడా ఆయన యోచిస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలను గుర్తించిన జగన్... వారిని త్వరలోనే పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కార్యక్రమాల అమలు ఖర్చును వారి నెత్తిపై పెట్టనున్నారని సమాచారం.