: నిజాయతీకి పట్టం కట్టిన మోదీ!... ఫలితంగా జవదేకర్ ఒక్కరికే ప్రమోషన్!
కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి పలు ఆసక్తికర కథనాలు వెలుగు చూస్తున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు మరో కీలక శాఖ సమాచార, ప్రసార శాఖను అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ... ఆయన నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖను తప్పించేశారు. అదే క్రమంలో వరుస వివాదాలకు నిలయమైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను స్మృతి ఇరానీ నుంచి తప్పించి... దానిని బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ కు అప్పగించారు. నిన్నటి విస్తరణలో మొత్తం 19 మంది కొత్త వారికి స్థానం కల్పించిన మోదీ... జవదేకర్ ఒక్కరికి మాత్రమే ప్రమోషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన కారణాలపై ఓ ఆసక్తికర కథనం వినిపిస్తోంది. నిన్నటిదాకా కేంద్ర పర్యావరణ మంత్రి (స్వతంత్ర హోదా)గా ఉన్న జవదేకర్... పర్యావరణ, అటవీ శాఖలకు సంబంధించి అనుమతుల జారీలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించారట. ఈ విషయంలో ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. గత ప్రభుత్వాల హయాంలో ఈ శాఖను నిర్వహించిన మంత్రుల పనితీరుతో పోలిస్తే జవదేకర్ సమర్థవంతంగా పనిచేసినట్లే లెక్క. కేంద్రంలోని ఉన్నతాధికారులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న మీదటే... నిజాయతీగా వ్యవహరిస్తున్న జవదేకర్ కు హెచ్ ఆర్డీ శాఖను అప్పగించిన మోదీ ఆయనకు కేబినెట్ మంత్రి హోదా కల్పించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా, నిజాయతీగా పనిచేస్తున్న జవదేకర్ కు హెచ్ ఆర్డీ మినిస్ట్రీ పగ్గాలు దక్కడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.