: మోదీ కేబినెట్ విస్తరణపై నిరసన గళం!... తొలగింపుపై వివరణ కోరతానంటున్న మన్ సుభ్ భాయ్!
కేంద్ర కేబినెట్ విస్తరణపై కేవలం గంటల వ్యవధిలోనే బీజేపీలో నిరసన గళం వినిపించింది. తన సొంత రాష్ట్రం గుజరాత్ కు చెందిన ప్రముఖ గిరిజన నేత మన్ సుఖ్ భాయ్ వాసవకు కేబినెట్ నుంచి మోదీ ఉద్వాసన పలికారు. గిరిజన శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న వాసవను తప్పించిన మోదీ.., గుజరాత్ కే చెందిన మరో గిరిజన నేత జస్వంత్ సింగ్ భభూర్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు. మోదీ నిర్ణయంపై నిన్న అహ్మదాబాదులో వాసవ నిరసన గళం వినిపించారు. తనను కేంద్ర కేబినెట్ నుంచి ఎందుకు తప్పించారో కూడా తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించిన వాసవ... దీనికి కారణం చెప్పాలని పార్టీ నాయకత్వాన్ని కోరతానని ప్రకటించి ఆయన పెను కలకలమే రేపారు. అయితే వాసవ పనితీరు సరిగా లేని కారణంతోనే మోదీ ఆయనను తన మంత్రివర్గం నుంచి తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.