: కాపీ కొట్టాల్సిన ఖర్మేంటి?... తెలంగాణ వాదనపై ఏపీ ఫైర్!
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు సంబంధించి తమ విధానాలను పూర్తిగా కాపీ కొట్టిందని తెలంగాణ చేసిన ఆరోపణలపై ఏపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు ఈ విషయంలో గతేడాది దేశంలోనే నెంబర్ 2 స్థానంలో ఉన్న తాము తెలంగాణ విధానాలను కాపీ కొట్టాల్సిన ఖర్మ తనకేంటని కూడా ఏపీ వాదిస్తోంది. ఈ మేరకు నిన్నటి తెలంగాణ వాదనకు ఏపీ నేడు తన వాదనను అధికారికంగా వినిపించేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ ఫిర్యాదుపై సమాచారం అందుకున్న వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ ను ఆరా తీశారు. ఈ విషయంలో తెలంగాణ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆరోఖ్యరాజ్ సీఎంకు వివరించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించాలని చంద్రబాబు ఆయనకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ తన వాదనను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘‘పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం నెలకొల్పి పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ ముందంజలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ప్రపంచ బ్యాంకు, కేంద్రం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించిన తొలి సర్వేలోనే రెండో స్థానంలో నిలిచాం. గతేడాది కంటే మెరుగైన స్థానం కోసం గుజరాత్ తో పోటీ పడుతున్నాం. తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. పారిశ్రామిక, వాణిజ్యపరమైన వివాదాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఆయా వివాదాలకు సంబంధించి న్యాయస్థానం వేసిన ప్రశ్నలను యథాతథంగా వెబ్ సైట్ లో పొందుపరిచాం. ఇందులో మార్పు చేర్పులకు వీల్లేదు. నిజానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించి ఈ ఏడాది జూన్ 30తో గడువు ముగిసినా... కేంద్రంపై ఒత్తిడి చేసి గడువును ఈ నెల 7 వరకు పొడిగించేలా చేశాం. అయినప్పటికీ సంబంధిత ఆధారాలను జూన్ 30 లోపే సమర్పించాం. తెలంగాణకు ఏమైనా సందేహాలుంటే... ప్రపంచ బ్యాంకు, కేంద్రం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలను సంప్రదించవచ్చు’’ అని ఏపీ తన వాదనను వినిపించనున్నట్లు సమాచారం.