: నేనుండనుగా... టెస్టు సిరీస్ కు వెళ్లే భారత జట్టు ముందు ధోనీ భావోద్వేగ ప్రసంగం!
వెస్టిండీస్ తో సుదీర్ఘ టెస్టు సిరీస్ కు బయలుదేరే భారత జట్టును ఉద్దేశించి వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావోద్వేగ ప్రసంగం చేశాడు. ధోనీ టెస్టు క్రికెట్ నుంచి విరమించుకున్న తరువాత ఇండియా చేస్తున్న సుదీర్ఘ పర్యటన ఇదేనన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జట్టంతా సమావేశం కాగా, వారిని ఉద్దేశించి ధోనీ మాట్లాడాడు. ఈ సుదీర్ఘ సీజన్ ను ఆటగాళ్లు చక్కగా వినియోగించుకోవాలని, మైదానంలో ఒకరితో ఒకరు సమన్వయంతో ఆడాలని అన్నాడు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే, విజయం దానంతట అదే వెన్నంటి నడిచి వస్తుందని తెలిపాడు. క్రికెట్ ను కూడా ఓ వినోద సాధనంగా భావించాలని, ఇంత పెద్ద పర్యటనను తాను ఆడబోవడం లేదని ఆలోచిస్తేనే బాధ కలుగుతోందని తెలిపాడు. ఇక్కడున్న వాళ్లలో అత్యధికులు ఐదేళ్ల వయసు నుంచే బ్యాటు పట్టుకున్నారని, గత రెండు మూడేళ్ల వ్యవధిలోనే జట్టులోకి వచ్చారని గుర్తు చేశాడు. సీనియర్లు జట్టుకు దూరమైన తరువాత భారత జట్టు తిరిగి టెస్టు జట్టుగా ఎదిగే క్రమంలో సమీప భవిష్యత్తులో ఆడనున్న 17 మ్యాచ్ లు ఎంతో కీలకమైనవని, ఆటగాళ్లు విజయం సాధించాలని కోరాడు. ధోనీ భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.