: ఐదేళ్ల కుమార్తె కారులో ఉండగా, భార్యను ముక్కలుగా నరికి తగులబెట్టిన హైదరాబాదీ... కారు బురదలో ఇరుక్కుని బుక్కయ్యాడు!
రూపేష్ కుమార్ అగర్వాల్... హైదరాబాద్ లో ఓ స్టాక్ బ్రోకర్. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సింథియాను చంపేసి, ముక్కలుగా నరికి, తన ఐదేళ్ల కుమార్తెతో కలసి కారులో వెళ్లి, శరీర భాగాలను పెట్రోల్ పోసి తగులబెట్టిన దుర్మార్గుడు. ఆపై తన వాహనం బురదలో కూరుకుపోగా, ఎటూ వెళ్లే దారిలేక దొరికిపోయాడు. హైదరాబాద్ లో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 35 సంవత్సరాల రూపేష్, 11 సంవత్సరాల క్రితం కాంగో దేశానికి చెందిన సింథియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐదేళ్ల పాప ఉంది. గత కొంత కాలంగా సింథియాకు ఫేస్ బుక్ లో ఓ ఫ్రాన్స్ జాతీయుడు పరిచయం అయ్యాడు. అతనితో తన భార్య సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను చూసి తట్టుకోలేకపోయిన అగర్వాల్ పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న సింథియా, కుమార్తెను తనతో తీసుకు వెళ్లాలని భావించింది. ఇది ఇష్టంలేని రూపేష్, ఆదివారం రాత్రి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆపై సోమవారం నాడు పొద్దున్నే తన కుమార్తెను స్కూల్లో వదిలి మృతదేహాన్ని మాయం చేసే ప్లాన్ తో ఇంటికి వచ్చాడు. సింథియా దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఓ సూట్ కేసు, మరో బ్యాగులో సర్దాడు. ఆ బ్యాగులను కారు డిక్కీలో పెట్టాడు. సాయంత్రం కుమార్తె ఇంటికి రాగానే, బయటకు వెళ్దామని చెప్పి, నగరానికి 24 కిలోమీటర్ల దూరం వెళ్లి నిర్జన ప్రదేశంలో కారు ఆపి బ్యాగు, సూట్ కేసు తీసి అక్కడ పెట్టి, పెట్రోల్ చల్లి నిప్పింటించాడు. అదే సమయంలో... అక్కడికి సమీపంలోని గ్రామస్తులు పొదల నుంచి పొగ రావడాన్ని చూసి ఏదో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోగా అక్కడి నుంచి వెళ్లాలనుకున్న రూపేష్ వాహనం బురదలో చిక్కుకుపోయి కదల్లేకపోయింది. సరిగ్గా అప్పుడే అక్కడికి చేరుకున్న సైబరాబాద్ పోలీసులు రూపేష్ ను ప్రశ్నించే సరికి మొత్తం ఉదంతం బయటపడింది. ఆ పాపకు ఏం జరిగిందన్నది ఇంకా తెలియదని, ఆమెను తాత, నానమ్మలకు అప్పగించామని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.