: జగన్ అడ్డుపడకపోతే మేనిఫెస్టోలో చెప్పని అభివృద్ధి పనులను సైతం చేసేవాళ్లం: మంత్రి ప్రత్తిపాటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు కురిపించారు. ఈరోజు గుంటూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులకు జగన్ అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. జగన్ తమ పనులకు అడ్డుపడకపోతే టీడీపీ మేనిఫెస్టోలో చెప్పని అభివృద్ధి పనులను సైతం చేపట్టేవాళ్లమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంపై జగన్‌కి నమ్మకం లేదని ఆయన అన్నారు. వైసీపీ అధినేత ప్రజాభిప్రాయ సేకరణ అంటూ హడావుడి చేస్తున్నారని, అయితే ఆయన కేసుల అంశంపైనే ముందుగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు. ప్రజల్లోకి వెళ్లి పరిశీలిస్తే వారు జగన్ గురించి ఏమనుకుంటున్నారో.. ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో వైసీపీ అధినేతకి తెలుస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరగకముందు జగన్ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆయన ఆరోపించారు. ఇటువంటి చర్యలకు దిగడం జగన్‌కే చెల్లుతుందని ఆయన అన్నారు.