: ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు: ఏపీ ప్రభుత్వంపై వైసీపీ నేత ధర్మాన ఫైర్
సదావర్తి భూముల అంశంపై వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈరోజు హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే భూములని అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. చట్టాలకు అనుగుణంగా అమ్మకం జరగాలని ఆయన అన్నారు. ప్రభుత్వం చేస్తోన్న తప్పుల్ని ప్రధాన ప్రతిపక్షంగా తాము ఎత్తి చూపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వానికి హిందువులకు సంబంధించిన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని ఆయన హితవు పలికారు. ఈ అంశంపై తాము పోరాడతామని చెప్పారు.