: మోదీ బాటలో కేజ్రీ!... ‘మన్ కీ బాత్’ తరహాలో ‘టాక్ టు ఏకే’!


ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిత్యం విమర్శలు ఎక్కుపెడుతున్న 'ఆప్' కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూటు మార్చేశారు. నిన్నటిదాకా మోదీకి ఎదురెళ్లిన కేజ్రీ... తాజాగా ప్రధాని బాటలోనే నడిచేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఇందులోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకోనున్నారు. వివరాల్లోకెళితే... దేశ ప్రజలతో వివిధ సమస్యలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆలిండియా రేడియోలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అయితే ఈ కార్యక్రమం కంటే మరింత మెరుగైన రీతిలో మరో కార్యక్రమానికి కేజ్రీ ప్లాన్ చేశారు. ‘టాక్ టు ఏకే’ (అరవింద్ కేజ్రీవాల్ తో మాట్లాడండి) పేరిట రూపొందిన ఈ కార్యక్రమంలో కేజ్రీవాల్ నేరుగా ప్రజలతో మాట్లాడతారు. ‘టాక్ టు ఏకే. కామ్’ పేరిట రూపొందించిన వెబ్ సైట్ లోకి ఎంటరై అక్కడ పేర్కొన్న నెంబర్లకు కాల్ చేసి నేరుగా కేజ్రీతో మాట్లాడవచ్చు. ఈ నెల 17న లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగనున్నట్లు కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. మోదీ అడుగు జాడల్లో నడుస్తున్నా... ఈ విషయంలోనూ కేజ్రీ ప్రధానిపై విమర్శలు సంధించారు. ‘మన్ కీ బాత్’లో ప్రజలకు నేరుగా ప్రధానితో మాట్లాడే అవకాశం లేదని చెప్పి కేజ్రీ... ‘టాక్ టు ఏకే’లో తనతో డిల్లీ ప్రజలు నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News