: వెస్టిండీస్ పర్యటనకు ముందు లోపాలు బయటపెట్టిన విరాట్ కోహ్లీ
కీలకమైన వెస్టిండీస్ పర్యటనకు భారత క్రికెట్ జట్టు బయలుదేరనున్న వేళ, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టులోని లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ వన్డేలు, టీ-20ల మూడ్ లో ఉన్న ఆటగాళ్లు అంత త్వరగా సుదీర్ఘ మ్యాచ్ లు ఆడటానికి సన్నద్ధం కాలేరని, మనవాళ్లకు దూకుడు అధికమని, అది టెస్టు ఫార్మాట్ కు సరిపడదని అభిప్రాయపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దూకుడు షాట్ల జోలికి పోయి వికెట్లు పారేసుకోరాదని సలహా ఇచ్చాడు. రివర్స్ స్వింగ్ లో వచ్చే బంతులను ఎదుర్కోవడంలో ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారని, స్వీప్ షాట్ ఆడటంలో మరింత ప్రాక్టీసు చేయాల్సి వుందని అన్నాడు. "మేమాడిన ఆఖరి టెస్టు సిరీస్ (సౌతాఫ్రికాపై) నుంచి చాలానే నేర్చుకున్నాం. ఏదైనా విరామ సమయానికి ముందు, తరువాత వికెట్లు చేజార్చుకోకుండా ఉంటే మెరుగైన స్కోరు చేయవచ్చని తెలుసుకున్నాం. ఆటలో ఆధిపత్యం చూపిస్తూ ఉండాలి. వికెట్లను త్వరగా కోల్పోరాదు" అని అన్నాడు. కాగా, సమీప భవిష్యత్తులో భారత జట్టు 17 టెస్టు మ్యాచ్ లను ఆడనుంది. భారత జట్టును ఓ మంచి టెస్టు జట్టుగా మలచడానికి ఈ మ్యాచ్ లు అత్యంత కీలకమని క్రికెట్ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇక అనిల్ కుంబ్లే కోచ్ గా వచ్చిన తరువాత, ఆయనకున్న విదేశీ అనుభవం జట్టుకు ఎంతో ఉపకరిస్తుందని భావిస్తున్నారు. "అనిల్ అన్న జట్టుతో ఉండటంతో ఆటగాళ్లకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. బౌలర్లు తమకు మరింత మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. దేశం తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా చరిత్ర సృష్టించిన అనిల్ సలహాలు మాకెంతో ముఖ్యం" అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.