: అరిష్టం చుట్టుకుంది, ఇక చస్తే గెలవలేవు: కేశినేని నానికి శివస్వామి శాపాలు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకు అత్యంత పురాతన దేవాలయాలను దగ్గరుండి కూలగొట్టించిన కేశినేని నాని, ఇకపై ఏ ఎన్నికల్లోనూ చచ్చినా గెలవలేడని శివపీఠాధిపతి శివస్వామి శాపాలు పెట్టారు. నిన్న విజయవాడలో జరిగిన పీఠాధిపతుల సమావేశంలో నానీపై నిప్పులు చెరిగిన శివస్వామి, దేవాలయాల కూల్చివేతతో ఆయనకు అరిష్టం చుట్టుకుందని, అది తెలుగుదేశం పార్టీకీ తగులుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ. 500 గా ఉన్న బస్సు టికెట్ ను రూ. 1000, రూ. 2000కు అమ్ముకుంటూ కోట్లు కూడబెట్టారని ఆరోపించారు. గత మూడు రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, హత్య చేస్తామని హెచ్చరిస్తున్నారని తెలిపారు. మరణానికి తాను భయపడేది లేదని, తన బ్యాంకు ఖాతాలో రూ. 3 వేలకు మించి ఎన్నడూ ఉండదని అన్నారు. దేవాలయాలను తొలగించాల్సి వస్తే, శాస్త్రోక్త పద్ధతులు ఉన్నాయని, వాటిని ఎంతమాత్రమూ పాటించకుండా, ఇష్టానుసారం భక్తుల మనోభావాలను దెబ్బతీశారని శివస్వామి ఆరోపించారు. జరిగిన ఘటనలను తేలికగా తీసుకునేది లేదని, ఎక్కడి దేవాలయాలను అక్కడే తిరిగి పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. శివస్వామి శాపాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొత్త చర్చకు తెరలేపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం మొత్తం ఉదంతాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆలయాలను తిరిగి నిర్మిస్తామని పీఠాధిపతులకు హామీలిచ్చారు.