: మాల్యాకు ఎంత శిక్ష పడుతుందో?... చెక్ బౌన్స్ కేసులో శిక్షను ఖరారు చేయనున్న హైదరాబాదీ కోర్టు!
బ్యాంకులకే కాకుండా శంషాబాదు ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న జీఎంఆర్ సంస్థకూ టోకరా ఇచ్చి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు తొలి శిక్ష నేడు ఖరారు కానుంది. శంషాబాదు ఎయిర్ పోర్టులో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల రాకపోకలకు సంబంధించి విజయ్ మాల్యా సంస్థ జీఎంఆర్ కు బకాయి పడింది. ఈ బకాయిల చెల్లింపుల పేరిట మాల్యా ఇచ్చిన రెండు చెక్కులు బౌన్సయ్యాయి. దీంతో జీఎంఆర్ సంస్థ హైదరాబాదు ఎర్రమంజిల్ లోని కోర్టులో మాల్యాపై ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన కోర్టు మాల్యాను దోషిగా తేల్చింది. అయితే శిక్షను ఇంకా ఖరారు చేయలేదు. దోషి లేకుండా శిక్షను ఖరారు చేయలేమన్న న్యాయమూర్తి మాల్యాను తమ ముందు హాజరుపరచాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కోర్టు జారీ చేసిన సమన్లను పోలీసులు మాల్యాకు అందించలేకపోయారు. మాల్యా చిరునామా లేని కారణంగానే సదరు సమన్లు తిరుగుటపాలో కోర్టుకు చేరాయి. ఈ నేపథ్యంలో నేడు ఈ విషయం ఆ కోర్టులో మరోమారు విచారణకు రానుంది. నేడు మాల్యా హాజరుకానున్నా... దోషిగా తేలిన ఆయనకు శిక్ష ఖరారు కావడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.