: అతిముఖ్య ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ అధినేత్రి
వచ్చే సంవత్సరం ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు శంఖారావాన్ని మోగిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓ అతిముఖ్య ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు యూపీకి సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున షీలాదీక్షిత్ పేరును ప్రకటించనున్నారని, ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక యూపీ ప్రచార బాధ్యతలు ప్రియాంకా గాంధీ మోస్తారని, రాష్ట్రమంతటా ఆమె పర్యటనలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారవుతున్నాయని సమాచారం. కాగా, మూడు పర్యాయాలు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్, 2013 డిసెంబరులో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక నరేంద్ర మోదీ సాధారణ ఎన్నికల్లో గెలవడానికి కారణమైన వారిలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు కాంగ్రెస్ పక్షాన ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రెండు నెలల క్రితమే యూపీ ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున బ్రాహ్మణ అభ్యర్థిని ప్రకటించాలని కోరారు కూడా. ఇప్పటికే ముస్లింలు, దళితేతర వెనుకబడిన వర్గాల మద్దతున్న కాంగ్రెస్, అగ్రవర్ణాల్లో కీలకమైన బ్రాహ్మణుల మద్దతు పొంది, 27 నుంచి 28 శాతం ఓట్లను సాధించగలిగితే, తిరిగి యూపీలో పీఠాన్ని హస్తగతం చేసుకోవచ్చన్నది ప్రశాంత్ వాదన.