: రోజాకు ఊరట!...‘ఎన్నిక’ కేసులో కౌంటర్ పిటిషన్ కు సుప్రీం ఓకే!
వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు నిన్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తన ఎన్నిక చెల్లదంటూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై ఆమెకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ మేరకు నిన్న హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను తప్పుగా ప్రకటించిన రోజా ఎన్నికను రద్దు చేయాలని రాయుడు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రోజా... అసలు రాయుడుకు తనపై పిటిషన్ వేసే అర్హతే లేదని వాదిస్తూ, రోజా కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు.... రాయుడు పిటిషన్ పై మాత్రమే విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో హైకోర్టు తీరును తప్పుబడుతూ రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై నిన్న విచారణ జరిపిన జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింగ్టన్ నారిమన్ లతో కూడిన డివిజన్ బెంచ్... రోజా కౌంటర్ పిటిషన్ ను విచారణకు అనుమతించాల్సిందేనని హైకోర్టుకు సూచించింది. అంతేకాకుండా ఆ రెండు పిటిషన్ల విచారణను ఒకే దఫా చేపట్టి ఏడాదిలోగా విచారణను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.