: 20 నిమిషాల కరెంట్ షాక్ తో మంచి కంటి చూపు!
ఇరవై నిమిషాల పాటు స్వల్పంగా విద్యుత్ ను ప్రసరింపజేయడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన పరిశోధకులు కంటిచూపును మెరుగుపరిచే అంశాలపై చేస్తున్న పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు కనుగొన్నారు. కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్ లు లేకుండా చూపును మెరుగుపరిచేందుకు 20 మంది ఆరోగ్యవంతులైన, కంటి చూపు బాగున్న యువకులపై పరిశోధన నిర్వహించారు. ఆ 20 మందికి పరస్పరం లంబంగా ఉన్న రెండు సరళ రేఖలను చూపించారు. అనంతరం వారి మెదడులోకి 20 నిమిషాల పాటు స్వల్పంగా విద్యుత్ ను పంపి పరిశోధన నిర్వహించారు. అనంతరం చిత్రంగా వీరిలో 75 శాతం మంది ఇంతకు ముందు చెప్పిన సమాధానం కంటే సరైన సమాధానం చెప్పడాన్ని గుర్తించారు. దీంతో ఈ పరిశోధన భవిష్యత్ కంటి చూపు మెరుగుపరిచే సర్జరీల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.