: దేవాలయాల తొలగింపు అంశంలో నేతలు సంయమనం పాటించాలి: చంద్రబాబు
దేవాలయాల తొలగింపు అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈరోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాల సందర్భంగా ఆలయాల తొలగింపు అంశంలో ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా నడుచుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆలయాల తొలగింపు అంశంపై తాము మంత్రులతో కూడిన కమిటీ వేశామని చెప్పారు. రోడ్లపై పలువురు అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆయన అన్నారు. అక్రమనిర్మాణాలను తొలగించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు. పుష్కరాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రోడ్ల విస్తరణ పనులు చేపట్టామని చంద్రబాబు చెప్పారు. దీనిలో భాగంగా దేవాలయాలు తొలగిస్తున్నామని ఆయన అన్నారు. తొలగించిన దేవాలయాలకు బదులుగా వాటి సమీపంలోనే కొత్త దేవాలయాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఈ అంశంపై టీడీపీ, బీజేపీ నేతలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.