: పొలాలు కదా, బురద ఉంటుంది... చిన్న చిన్న ఇబ్బందులుంటే మంచి మనసు చూపించండి: చంద్రబాబు
తాత్కాలిక సచివాలయంలో మరో 2 నెలల్లో పనులన్నీ పూర్తయిపోయి, అన్ని విభాగాలూ వచ్చేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వెలగపూడిలో పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో బురద అధికంగా ఉందని ఉద్యోగులు, ముఖ్యంగా మహిళల నుంచి ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పిన ఆయన, "ఈ ప్రాంతంలో కొద్దిగా ఇన్ కన్వీనియన్స్ గా ఉంటుంది. ఎందుకంటే, బురద ఉంటుంది కాబట్టి. పొలాలు కాబట్టి కొంత బురదకు అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా ల్యాండు కూడా కొంచెం లూజ్ సాయిల్ కాబట్టి, మనం రోడ్డు వేసినా సింక్ అవుతుంది. అందుకే ముందుగా మెటల్ రోడ్స్ ఎలా వేయాలని చూస్తున్నాం. బిల్డింగ్ లన్నీ అనుకున్న ప్రకారం, ఐదారు వారాల్లో అయిపోతాయి. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. మంచి మనసును చూపించి ఉద్యోగులు సర్దుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అన్నారు. ఐటీ కంపెనీల్లో ఉండేలా, ఏసీల నుంచి అన్ని మౌలిక వసతుల వరకూ ఇక్కడ పనిచేసే వారికి కల్పించనున్నామని అన్నారు. ఆగస్టు చివరికి పూర్తి సచివాలయం ఇక్కడే ఉంటుందని, ఏ కొద్ది మందో తప్ప, అందరూ వచ్చేశారని తెలిపారు. ప్రారంభ దశ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయని చంద్రబాబు అన్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సమస్యలు ఉంటాయని, పనిలోకి దిగితేనే అవి ఏంటన్నవి తెలుస్తుందని తెలిపారు. సంప్రదాయ ప్రభుత్వ కార్యాలయాలతో పోలిస్తే, మరింత మెరుగ్గా, వన్నాఫ్ ది బెస్ట్ గా ఇక్కడ క్రియేట్ చేయనున్నామని వివరించారు. వారం పది రోజుల్లో ఇబ్బందులన్నింటినీ తీరుస్తామని వివరించారు.