: చంద్రబాబుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇప్పించేందుకు ఎంతో కష్టపడ్డా: కరణం బలరాం
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వేళ, చంద్రబాబునాయుడికి మంత్రి పదవిని ఇప్పించేందుకు తానెంతో కష్టపడ్డానని, ఆ విషయాలు చంద్రబాబుకు బాగా తెలుసునని తెలుగుదేశం పార్టీ నేత కరణం బలరాం వ్యాఖ్యానించారు. అయితే ఆనాటి ఘటనలు ఇప్పుడు అప్రస్తుతమని అన్నారు. ఓ టెలివిజన్ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరో 8 మంది వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకుని విజయసాయిరెడ్డి గెలుపును అడ్డుకోవాలన్న ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ అడుగులు వేసిందని ఆయన తెలిపారు. నాలుగో రాజ్యసభ సీటు కోసమే ఫిరాయింపులకు ప్రోత్సాహం లభించిందని కరణం బలరాం వివరించారు. దివంగత ఎన్టీఆర్ అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటిల మధ్య విభేదాలతో తాను ఎంతో నష్టపోయానని తెలిపారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తన దృష్టిలో చిన్న పిల్లాడని అభివర్ణించారు.