: పుట్టింటికని చెప్పి మౌనికను తీసుకెళ్లి చంపింది కన్నతండ్రే!
కన్న తండ్రితో కలసి పుట్టింటికి వెళుతున్న నవ వధువు కిడ్నాప్, హత్య మిస్టరీ వీడింది. స్వయంగా తండ్రే ఆమెను హతమార్చినట్టు పోలీసులు సంచలన విషయాన్ని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేటకు చెందిన మౌనిక (19)కు మూడు నెలల క్రితం వివాహం జరిగింది. శనివారం రాత్రి ఆమెను పుట్టింటికి తీసుకువెళ్లేందుకు వచ్చిన తండ్రి మల్లయ్య, ఆమెను బైక్ ఎక్కించుకుని వెళ్లాడు. ఆపై గోవిందారం దగ్గర ఎవరో ఇద్దరు తనను కొట్టి, అమ్మాయిని లాక్కెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారిస్తుండగానే, నిన్న గ్రామ శివార్లలో మౌనిక మృతదేహం లభించింది. యువతినిగానీ, దుండగులను కానీ గ్రామస్తులు ఎవరూ చూడలేదని, ఆమె కిడ్నాప్ ఆనవాళ్లు లభించకపోవడంతో పోలీసులకు మల్లయ్య మీదే అనుమానం వచ్చింది. దీంతో మల్లయ్యను గట్టిగా ప్రశ్నిస్తే, తానే కూతురిని హత్య చేసినట్టు చెప్పాడు. కూతురిపై కోరికతో కామాంధుడైన తండ్రి, అత్యాచారానికి ప్రయత్నించాడని, ఆమె గట్టిగా ప్రతిఘటించే సరికి, హత్య చేశాడని పోలీసులు తెలిపారు. కట్టుకున్న చీర కొంగుతో మెడ బిగించి చంపాడని, నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. గత సంవత్సరం రంగారెడ్డి జిల్లాలో సైతం ఇదే తరహా ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సమాజంలో రోజురోజుకూ మానవ విలువలు పతనమవుతున్నాయని చెప్పడానికి ఈ తరహా ఘటనలు పెరుగుతుండటమే కారణం.