: కొండముచ్చువని తిట్టిపోసేది... అందుకే తట్టుకోలేకపోయా!: ఇన్ఫీ ఉద్యోగి స్వాతి హంతకుడు
తాను నల్లగా ఉన్న కారణంగా తనను కొండముచ్చులా ఉన్నావని స్వాతి పదేపదే హేళన చేస్తుంటే, తట్టుకోలేకనే రాక్షసుడిగా మారిపోయానని ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని రైల్వే స్టేషనులో అందరూ చూస్తుండగా హత్య చేసి పోలీసులకు చిక్కిన రామ్ కుమార్ విచారణలో తెలిపాడు. గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన రామ్ కు చికిత్స అనంతరం, లోతైన విచారణ కోసం చెన్నైకి తరలించారు. గత రాత్రంతా విచారణ జరుగగా, తమ పరిచయం నుంచి ప్రతి విషయాన్నీ రామ్ చెప్పుకొచ్చాడు. ఫేస్ బుక్ ద్వారా స్వాతి పరిచయం కాగా, ఆమె కోసమే తాను చెన్నై వచ్చానని, తన ప్రేమకు వ్యక్తం చేసినప్పుడల్లా, ఆమె తిరస్కరిస్తూనే ఉందని వివరించాడు. అయితే, తాను వెంటపడుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడంతో, మనసులో ప్రేమ ఉందని, ఏనాటికైనా బయటపడుతుందని భావించి వెంటపడుతుండేవాడినని అన్నాడు. తనను ద్వేషించడంతో పాటు, తిడుతూ ఉంటే తట్టుకోలేకపోయానని చెప్పాడు. సొంత ఊరికి వెళ్లిన సమయంలో అరటి గెలలు కోయడానికి సిద్ధంగా ఉంచిన కత్తిని తెచ్చుకున్నానని వివరించాడు. స్వాతిని హత్య చేయాలన్న ఉద్దేశం తనకు ఎంతమాత్రమూ లేదని, కేవలం తనను ప్రేమించాలని ఒత్తిడి తేవాలనే రైల్వే స్టేషనులో అటకాయించానని, అయితే, ఆమె మాటలు తనను ఉన్మాదిని చేశాయని రామ్ కుమార్ పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్యా మరో మిత్రుడు కూడా ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు, అతని కోసం విచారణ మొదలు పెట్టారు. స్వాతి హత్య తరువాత తాను మీనాక్షిపురం పారిపోయానని, హత్యకు సంబంధించిన వార్తలు తెలుసుకుంటూ వచ్చానని, తన ఇంటికి మహిళా కానిస్టేబుల్ వచ్చి వెళ్లిననాడే, పోలీసులకు విషయం తెలిసిపోయిందని భావించానని చెప్పాడు. తప్పించుకు తిరిగేందుకు మేకల మందను తోలుకుని బయటకు వెళ్లానని చెప్పుకొచ్చాడు. రామ్ కుమార్ హత్య చేసేంత దుర్మార్గుడంటే, చుట్టుపక్కల వారు, స్నేహితులు నమ్మకపోవడం గమనార్హం. రామ్ ప్రేమ, ఫేస్ బుక్ పరిచయాల గురించి తమకేమాత్రం తెలియదని వారి కుటుంబసభ్యులు వెల్లడించారు. స్వాతి సెల్ ఫోన్, రక్తపు మరకలతో ఉన్న చొక్కాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నేడు అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు.