: రంగంలోకి ప్రియాంకా గాంధీ!... యూపీ ఎన్నికల్లో 150 ర్యాలీల్లో పాల్గొననున్న సోనియా కూతురు!


గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల కల ఎట్టకేలకు నెరవేరనుంది. దేశంలోనే కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా పార్టీ ప్రచారాన్ని భుజాన వేసుకోనున్నారు. ఇప్పటిదాకా గాంధీ కుటుంబం బరిలోకి దిగుతున్న ఆ రాష్ట్రంలోని రాయబరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారానికి ప్రియాంకా పరిమితమైన విషయం తెలిసిందే. అయితే గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగితేనే ఆశించిన మేర ఫలితాలు వస్తాయని కార్యకర్తలు అధిష్ఠానానికి విన్నవించారు. అయితే ఈ విషయంపై అధిష్ఠానం చాలా కాలం పాటు తటపటాయించింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హవా పనిచేయడం లేదన్న వాస్తవాన్ని గ్రహించిన అధిష్ఠానం ఎట్టకేలకు ప్రియాంకాను రంగంలోకి దింపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది యూపీలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో పార్టీ ప్రధాన అస్త్రంగా ఆమెను బరిలోకి దించనుంది. ఈ మేరకు ప్రియాంకా గాంధీ ఏకంగా 150 ర్యాలీల్లో పాల్గొంటారని ఆ పార్టీ యూపీ శాఖ చెబుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకున్నా, పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని ఓ కీలక నేత నిన్న వెల్లడించారు.

  • Loading...

More Telugu News