: రెండు రోజుల తర్వాత శిథిలాల నుంచి మహిళను రక్షించిన ఆర్మీ.. ఫేస్‌బుక్‌లో వీడియో వైరల్
శిథిలాల్లో రెండు రోజులుగా చిక్కుకుపోయిన మహిళను ఆర్మీ జవానులు రక్షించిన వీడియో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇండియన్ ఆర్మీ ఫేస్‌బుక్‌లో ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు 2.13లక్షల మంది తిలకించారు. ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన భారీ వరదల్లో పలువురు చనిపోగా మరెందరో నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. పితోర్‌గఢ్, చమోలీ జిల్లాలు వరదల ధాటికి అతలాకుతలమయ్యాయి. వరదలు బీభత్సం సృష్టించడంతో సహాయకచర్యల కోసం ఆర్మీ, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సీమా సురక్షా బల్(ఎస్ఎస్‌బీ) రంగంలోకి దిగాయి. పితోర్‌గఢ్ జిల్లాలోని బస్తాడి గ్రామంలో కూలిపోయిన ఓ ఇంటి శిథిలాల కింద మహిళ చిక్కుకుపోయిందన్న సమాచారంతో ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగారు. రెండు రోజులుగా శిథిలాల కింద చిక్కుకుని స్పృహ కోల్పోయిన బాధితురాలిని జవాన్లు సజీవంగా రక్షించి బయటకు తీశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మహిళ ప్రాణాలతో బయటపడడంతో జవాన్ల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. సంతోషంతో కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆర్మీ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దీనిని నెటిజన్లు విరగబడి చూస్తున్నారు.