: మాయ లేడీ.. బంగారానికి బదులు టమోటా ఇచ్చి అడ్డంగా బుక్కయింది


ప్రజల బలహీనతలను ఆయుధంగా చేసుకుంటున్న నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో మెప్పించి బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దోచుకుని పరారవుతున్నారు. తాజాగా చెన్నైలో ఓ మాయ లేడీ ఇదే పనిచేసింది. బంగారానికి బదులు టమోటా ఇచ్చి పలాయనం చిత్తగించాలనుకుంది. కానీ పట్టుబడి కటకటాలు లెక్కపెట్టుకుంటోంది. చెన్నైలోని నెమ్మిలిచెరీకి చెందిన లక్ష్మి(35) శనివారం ఉదయం ఇంద్రాణి(50) ఇంటికి వెళ్లింది. తానో నర్సునని, తన వద్ద సింగపూర్ నుంచి తెచ్చిన ఆయింట్‌మెంట్ ఉందని ఎటువంటి నొప్పులనైనా చిటికెలో తగ్గిస్తుందని చెప్పింది. అప్పటికే కాళ్ల నొప్పులతో బాధపడుతున్న ఇంద్రాణి.. ఆయింట్‌మెంట్ తీసుకునేందుకు సిద్ధపడింది. దానిని తానే కాళ్లకు రాస్తానని చెప్పిన నిందితురాలు ఇంద్రాణిని నగలు తీసి కింద పడుకోమని కోరింది. నగలు తీసిన ఇంద్రాణి వాటిని చీరకొంగుకు కట్టుకుంది. అనంతరం ఆమె కాళ్లకు ఆయింట్‌మెంట్ రాసిన లక్ష్మి రిలాక్స్ కోసం కళ్లు మూసుకోవాలని కోరింది. ఆమె కళ్లు మూసుకోగానే చీరకొంగులోని నగలు తీసేసుకుని ఆ స్థానంలో ఓ టమోటాను కట్టింది. తర్వాత నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లి అల్మారాలోని రూ.19వేల నగదును కాజేసి పరారయేందుకు సిద్ధమైంది. ఈలోగా కళ్లు తెరిచిన బాధితురాలు మోసాన్ని గుర్తించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇటువంటి దొంగతనాల్లో ఆమె సిద్ధహస్తురాలని, ఆమెపై పలు కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News